మ్యూజియంలో మిలియనీర్ ‘దొంగ’
-
15 లక్షల ఏళ్ల నాటి ‘గొడ్డలి’ చోరీ.. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఘటన
-
పోలీసులపైకి కుక్కలతో దాడి!.. నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు
న్యూఢిల్లీ: అతడో మిలియనీర్.. అతడి తండ్రి కోస్టు గార్డులో ఐజీ స్థాయిలో పనిచేసి పదవీ విరమణ చేశారు. సమాజంలో ఎనలేని గౌరవ మర్యాదలున్నాయి. కానీ అతడికో బలహీనత.. అదే ఇప్పుడతడిని నవ్వులపాలు చేసింది. ఏదైనా విలువైన వస్తువులు నచ్చితే.. కొట్టేయకుండా ఉండలేడు!! గత నెల 24న ఢిల్లీలో ని నేషనల్ మ్యూజియంలో 15 లక్షల ఏళ్ల నాటి గొడ్డలి చోరీకి గురైంది. దాన్ని ఎవరు దొంగిలించారో తెలుసుకునేందుకు మ్యూజియం అధికారులు సీసీటీవీ ఫుటేజీని బయటకు తీశారు. దీని ఆధారంగా పోలీసులకు ఫిర్యా దు చేయగా.. అతడు గుర్గావ్‌కు చెందిన మిలియనీర్ అని తేలింది. అతడి పేరు ఉదయ్ రాత్ర (53). కోట్లకు ఆస్తులున్న వ్యక్తి అయినప్పటికీ దొంగతనం చేయడంపై పోలీసులు షాక్ అయ్యారు. శుక్రవారం రాత్రి అతడి ఇంటికి వెళ్లి నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసినట్లు డీసీపీ మధుర్ వర్మ వెల్లడించారు. ఈ వివరాలను ఆయన ట్వీట్ చేశారు. తొలుత పోలీసులు ఉదయ్ ఇంటికి వెళ్లగానే.. లోనికి రానిచ్చేందుకు అతడు ఒప్పుకోలేదు. అనంతరం తర్వాతి రోజు ఉదయం రావాలంటూ గొడవకు దిగాడు. పోలీసులు ససేమిరా అనడంతో ఇంట్లో ఉన్న 8 పెంపుడు కుక్కలను వారిపైకి వదిలాడు. అవి దాడికి పైకి దూకబోవడంతో.. సరే తర్వాత రోజు వస్తామంటూ వారు వెనుదిరిగినట్లు నటించారు. ఆనక ఇంటి చుట్టూ నక్కి దాక్కున్నారు. పోలీసులు వెళ్లిపోయారనుకున్న ఉదయ్ ఆ గొడ్డలితో పారిపోయే ప్రయ త్నం చేశారు. దీంతో వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఉదయ్ నేరాలకు పాల్పడడం ఇదే తొలిసారి కాదని డీసీపీ వర్మ తెలిపారు. దాదాపు 20 ఏళ్లపాటు యూకేలో ఉన్న అతడిని ఆ దేశం 2006 భారత్‌కు డీపోర్ట్ చేసింది. ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో 2016 లో ఇంపోర్టెడ్ మద్యం చోరీ చేసి అరెస్టయ్యాడు. అయితే ఉదయ్‌కు క్లెప్టోవేునియాక్ అనే మానసిక వ్యాధి ఉందని, అందువల్లే కోట్లకు ఉన్నా దొంగతనాలు చేయడం బలహీనతగా మారిందని ఓ అధికారి పేర్కొన్నారు.